ప్రకటన గ్రంథం
యోహాను రాసిన ప్రకటన గ్రంథం
గ్రంథకర్త
ప్రభువు తన దూత ద్వారా వెల్లడించిన దాన్ని గ్రంథస్తం చేసిన వాడిగా అపోస్తలుడు యోహాను తనను పరిచయం చేసుకుంటున్నాడు. జస్టిన్ మార్టర్, ఐరేనియస్, హిప్పోలైటస్, తెర్తుల్లన్, అలెగ్జాండ్రియా వాడైన క్లెమెంటు, మురటోరియన్లు మొదలైన వారంతా ప్రకటన గ్రంథం రచయితగా అపోస్తలుడు యోహానునే పేర్కొన్నారు. ప్రకటన గ్రంథాన్ని యోహాను దర్శన సాహిత్య శైలిలో రాశాడు. ఇది యూదుల రచనా శైలికి సంబంధించిన నమూనా. ఇందులో హింసల్లో ఉన్నవారికి అలంకారికంగా, సాదృశ్యరూపంగా నిరీక్షణను (అంతిమ విజయం దేవునిదే) వెల్లడించే పధ్ధతి కనిపిస్తుంది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 90 - 96
ఏజియన్ సముద్రంలో ఒక ద్వీపం పత్మాస్ లో తాను ఉన్నట్టు యోహాను చెబుతున్నాడు. అక్కడ అతనికి ఈ దర్శనాలు కలిగాయి.
స్వీకర్త
ఆసియాలోని 7 సంఘాల కోసం ఈ ప్రవచనాలు వచ్చాయని యోహాను చెప్పాడు.
ప్రయోజనం
ప్రకటన గ్రంథ రచన ఉద్దేశం క్రీస్తును (1:1), అయన వ్యక్తిత్వాన్ని, అయన బలప్రభావాలను, త్వరలో జరగబోయే వాటిని అయన సేవకులకు చూపించడం. ఈ లోకం త్వరలో అంతం అవుతుందనీ, తీర్పు తప్పక వస్తుందనీ చెప్పే అంతిమ హెచ్చరిక ఇందులో ఉంది. తమ బట్టలు తెల్లగా ఉంచుకున్న వారికోసం ఎదురు చూస్తున్న పరలోక వైభవం తాలూకు మచ్చుతునకలు ఈ గ్రంథంలో కనిపిస్తాయి. మహా బాధల కాలం, అందులోని యాతనలు, అవిశ్వాసులు శాస్వతంగా అనుభవించబోయే నరకాగ్నిఈ గ్రంథం మనకు చూపుతుంది. సాతాను పతనం, అతని, అతని దూతల వినాశనం ఇందులో మనకు కనిపిస్తుంది.
ముఖ్యాంశం
వెల్లడింపు
విభాగాలు
1. క్రీస్తు చేసిన వెల్లడింపు, యేసు ఇచ్చిన సాక్ష్యం — 1:1-8
2. “నీవు చూసినవి” — 1:9-20
3. ఏడు స్థానిక సంఘాలు — 2:1-3:22
4. త్వరలో సంభవించబోయేవి — 4:1-22:5
5. ప్రభువిచ్చే చివరి హెచ్చరిక, అపోస్తలుని చివరి ప్రార్థన — 22:6-21