NEH intro

☀️

నెహెమ్యా

నెహెమ్యా

గ్రంథకర్త

యూదుల సంప్రదాయం నెహెమ్యా (“యోహోవా ఆదరణ”) ఈ చారిత్రిక గ్రంథానికి ముఖ్య గ్రంథకర్తగా గుర్తిస్తున్నది. ఈ గ్రంథంలో ఎక్కువ భాగం అతని వ్యక్తిగత అనుభవాలే. ఇతని యవ్వన ప్రాయం, నేపధ్యం గురించి సమాచారం లేదు. అర్తహషస్త రాజుకు గిన్నె అందించే వాడుగా, పారశీక రాజాస్థానంలో రాజోద్యోగిగా మొదటిగా ఇతన్నిచూస్తాం (నెహెమ్యా 1:11-2:1). నెహెమ్యా గ్రంథాన్ని ఎజ్రా గ్రంథానికి రెండవ భాగంగా చదువుకోవచ్చు. ఈ రెండూ మొదట్లో ఒకే పుస్తకం అని కొందరు పండితులు అభిప్రాయం.

రచనా కాలం, ప్రదేశం

సుమారు క్రీ. పూ. 456 - 400

ఈ గ్రంథం యూదయలో యెరూషలేములో రాశారు. యూదులు బబులోను చెర నుండి తిరిగి వచ్చాక పారశీక రాజ్యపరిపాలన కాలంలో గ్రంథ రచన జరిగింది.

స్వీకర్త

బబులోను చెర నుండి తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయులు.

ప్రయోజనం

దేవుడు ఎన్నుకున్న ప్రజల పట్ల ఆయన ప్రేమ, ఆయన పట్ల వారికి ఉండవలసిన నిబంధన బాధ్యతలను వారు గుర్తించాలన్నది నెహెమ్యా స్పష్టమైన ఉద్దేశం. దేవుడు ప్రార్థనలకు జవాబిస్తాడు. వారి జీవితాలు పట్ల ఆయన ఆసక్తి చూపుతాడు. వారు తన అజ్ఞలు పాటించడానికి వారికి అవసరమైన వాటిని ఇస్తుంటాడు. ప్రజలు తమ వనరులను ఒకరితో ఒకరు పంచుకుంటూ కలిసి పనిచెయ్యడం అవసరం. దేవుని ప్రజల మధ్య స్వార్దానికి తావు లేదు. పేదల నిస్సహాయతను అసరాగా తీసుకొని వారిని దోచుకోకూడదని ధనికులకు, రాజవంశీయులుకు నెహెమ్యా హెచ్చరించాడు.

ముఖ్యాంశం

పునర్నిర్మాణం

విభాగాలు

1. గవర్నరుగా మొదటి నియామకం — 1:1-12:47

2. గవర్నరుగా రెండవ నియామకం — 13:1-31

Navigate to Verse