కొలస్సీ పత్రిక
కొలస్సయులకు రాసిన పత్రిక
గ్రంథకర్త
కొలోస్సి పత్రిక నిఖార్సైన పౌలు రచన (1:1). ఆది సంఘంలో ఈ పత్రిక గురించి ప్రస్తావించిన వారంతా పౌలుకే గ్రంథ కర్తృత్వం ఆపాదించారు. కొలోస్సి సంఘం పౌలు స్థాపించలేదు. పౌలు జత పనివారిలో ఒకడు, బహుశా ఎపఫ్రా మొదటగా కొలోస్సిలో సువార్త ప్రకటించాడు (4:12, 13). అబద్ధ బోధకులు ఏదో కొత్త సిద్ధాంతంతో ఇక్కడికి వచ్చారు. వారు విగ్రహారాధక వేదాంతాన్ని, యూదు మతాన్నీ. క్రైస్తవ బోధను కలిపి కొత్త బోధ మొదలుపెట్టారు. క్రీస్తు అన్నిటికన్నా పైనున్న వాడని చెప్పడం ద్వారా పౌలు ఈ బోధను వ్యతిరేకించాడు. కొత్త నిబంధన అంతటిలోకీ ఎక్కువ క్రీస్తు కేంద్రిత పత్రికగా దీన్ని చెబుతారు. క్రీస్తును అన్నిటి మీదా శిరస్సుగా ఈ పత్రిక సూచిస్తున్నది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 60 - 63
స్వీకర్త
పౌలు దీన్ని కొలోస్సి సంఘ విశ్వాసులను ఉద్దేశించి రాశాడు. “క్రీస్తు నందు విశ్వాసులైన సహోదరులకు” (1:1-2). ఈ సంఘం ఎఫెసు నుండి 100 కి. మీ. లోపలి వైపుగా లైకస్ లోయ మధ్యభాగంలో ఉంది. అపోస్తలుడు ఈ సంఘాన్ని ఎన్నడూ దర్శించలేదు (1:4; 2:1).
ప్రయోజనం
కొలోస్సి ప్రాంతంలో మొదలైన ప్రమాదకరమైన దుర్బోధ విషయం సంఘానికి హెచ్చరికగా పౌలు ఈ లేఖ రాశాడు. ఈ దుర్బోధకు జవాబివ్వడానికి సృష్టి అంతటి మీదా క్రీస్తు యొక్క తిరుగు లేని, సూటియైన, అంతం లేని ఆధిపత్యాన్ని నొక్కి చెప్పాడు (1:15; 3:4). సృష్టి అంతటిపై క్రీస్తు మాత్రమే అధికారి గనక, అందుకు తగినట్టు వారు జీవించాలని ప్రోత్సాహపరుస్తున్నాడు (3:5; 4:6). ఆ దుర్బోధకుల బెడదను ఎదిరించి క్రైస్తవులు తమ క్రమబద్ధమైన జీవన విధానం కొనసాగించాలని వారికి ధైర్యం చెప్పాడు (2:2-5).
ముఖ్యాంశం
క్రీస్తు ఆధిపత్యం
విభాగాలు
1. పౌలు ప్రార్థన — 1:1-14
2. క్రీస్తులో ఉన్న వాడికి పౌలు నేర్పిన సిద్ధాంతం — 1:15-23
3. దేవుని ప్రణాళిక, ప్రయోజనాల్లో పౌలు పాత్ర — 1:24-2:5
4. దుర్బోధలకు వ్యతిరేకంగా హెచ్చరిక — 2:6-15
5. ప్రమాదకరమైన దుర్బోధ పై పౌలు దాడి — 2:16-3:4
6. క్రీస్తులో నూతన వ్యక్తి వర్ణన — 3:5-25
7. మెప్పు, అంతిమ అభినందన — 4:1-18