3 యోహాను పత్రిక
యోహాను రాసిన మూడవ పత్రిక
గ్రంథకర్త
యోహాను 3 పత్రికలూ ఒక వ్యక్తి రాసినవే. ఎక్కువ మంది పండితులు అపోస్తలుడు యోహన్ రాశాడని అభిప్రాయపడుతున్నారు. తనకు సంఘంలో ఉన్న స్థానాన్ని బట్టి, తన పెద్దవయసుని బట్టి, యోహాను తనను “పెద్ద” గా చెప్పుకుంటున్నాడు. ఈ పత్రిక ఆరంభం, ముగింపు, శైలి, 2 యోహానుకు సరిపోలుతున్నాయి గనక ఈ రెంటినీ ఒకడే రాశాడని భావించవచ్చు.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ 85 - 95
ఆసియా మైనర్ లోని ఎఫెసు పట్టణం లో యోహాను ఈ పత్రిక రాశాడు.
స్వీకర్త
దీన్ని యోహాను గాయి అనే వ్యక్తికి రాశాడు. ఇతడు యోహానుకు పరిచయం ఉన్న సంఘాల్లో ఒక దానిలో ప్రాముఖ్యమైన మనిషి అయి ఉండవచ్చు. గాయి ఆతిథ్యంలో పేరు గాంచిన వాడు.
ప్రయోజనం
స్థానిక సంఘంలో వ్యక్తులు తమను తాము గొప్ప చేసుకోవడం గురించి హెచ్చరించడం. అంతేగాక సత్య వాక్య ప్రబోధకుల అవసరాలను తన అవసరాలకంటే ప్రాముఖ్యంగా ఎంచడంలో అతణ్ణి మెచ్చుకోవడం (వ. 5-8). క్రీస్తు పరిచర్య కంటే తనను అధికునిగా చూసుకుంటున్న దియోత్రెఫేను గురించి యోహాను హెచ్చరిస్తున్నాడు (వ. 9). సంచార సువార్త ప్రబోధకునిగా ఈ పత్రికను తెచ్చిన వానిగా దేమేత్రిని కూడా యోహాను మెచ్చుకున్నాడు (వ. 12). తని త్వరలో వారి దగ్గరకు వస్తున్నానని చెబుతున్నాడు.
ముఖ్యాంశం
విశ్వాసుల ఆతిథ్యం
విభాగాలు
1. పరిచయం — 1:1-4
2. సంచార సువార్తికులకు ఆతిథ్యం — 1:5-8
3. దుర్మర్గాతను కాక మంచిని అనుకరించడం — 1:9-12
4. ముగింపు — 1:13-15