1 యోహాను పత్రిక
యోహాను రాసిన మొదటి పత్రిక
గ్రంథకర్త
ఈ పత్రికలో దీని రచయిత పేరు కనిపించదు. కానీ సంఘం ఎంతో స్పష్టం బలంగా మొదటి నించీ ఇస్తూ వచ్చిన సాక్ష్యం ప్రకారం దీని రచయిత శిష్యుడు, అపోస్తలుడు యోహాను (లూకా 6:13, 14). ఈ లేఖల్లో యోహాను పేరు కనిపించకపోయినప్పటికీ ఇతడే రచయిత అనడానికి మూడు ఆధారాలు ఉన్నాయి. రెండవ శతాబ్ది రచయితలు యోహానునే ఈ పత్రిక రాసినట్టు పేర్కొన్నారు. రెండవది, ఈ పత్రికలో యోహాను సువార్త పదజాలం, శైలి ఉన్నాయి. మూడవదిగా రచయిత తాను యేసు శరీరాన్ని చూశానని, తాకానని చెప్పాడు. ఈ మాట యోహానుకు తప్పక వర్తిస్తుంది.
రచనా కాలం, ప్రదేశం
సుమారు క్రీ. శ. 85 - 95
ఎఫెసులో తన వృద్ధాప్యంలో యోహాను ఇది రాశాడు.
స్వీకర్త
ఈ లేఖ ఎవరికి రాశాడో ఇక్కడ స్పష్టంగా చెప్పలేదు. కానీ ఇందులోని విషయాన్నీ బట్టి, విశ్వాసులకె రాశాడనుకోవచ్చు (1:3-4; 2:12-14). అనేక ప్రదేశాల పరిశుద్ధుకోసం అతడు రాసి ఉండవచ్చు. స్థూలంగా అంతటా ఉన్న క్రైస్తవులన్నమాట. 2:1, “నా చిన్న పిల్లలారా.”
ప్రయోజనం
మనం ఆనందంతో నిండి పోవాలనీ, పాపం నుండి తప్పించుకోవాలనీ, రక్షణ నిశ్చయత కలిగి ఉండాలనీ విశ్వాసి క్రీస్తుతో వ్యక్తిగత సంబంధంలోకి రావాలనీ, సహవాసం పెంపొందాలనీ యోహాను రాశాడు. యోహాను ముఖ్యంగా సంఘం నుంచి వేరై పోయి సువార్త సత్యం నుండి మనుషులను దూరం చేయజూస్తున్న అబద్ధ బోధకుల సమస్యను ముఖ్యంగా చర్చించాడు.
ముఖ్యాంశం
దేవునితో సహవాసం
విభాగాలు
1. అవతారం వాస్తవికత — 1:1-4
2. సహవాసం — 1:5-2:17
3. మోసాన్ని పసిగట్టడం — 2:18-27
4. ప్రస్తుతం పవిత్ర జీవనానికి ప్రేరణ — 2:28-3:10
5. నిశ్చయతకు పునాది ప్రేమ — 3:11-24
6. అబద్ధ ఆత్మల వివేచన — 4:1-6
7. పవిత్రీకరణకు అవశ్యకమైన సంగతులు — 4:7-5:21